వర్షాకాలం, జోరున వాన పడుతోంది. అతని చేతులు కంప్యూ్టర్ కీబోర్డుపై వేగంగా ఆడుతున్నాయి. ముఖం లో ఎదో తెలియని కోపం, దీక్షగా చూస్తే బయటకి రాకుండా ఆగిపోతున్న కన్నీరు. ఉన్నట్టుండి ఆ చేతుల చలనం ఆగిపోయింది, అతను లేచి బయటకి వచ్చాడు. బాగా వేగంగా పడుతున్న వర్షాన్ని చూసి ఒక చిన్న నవ్వుని తన ముఖముపై తెచుకున్నాడు. కానీ ఆ నవ్వులో జీవం లేదు. ఎందుకోతెలియని వేదన అతని ఆనందాన్ని తుంచి వేస్తున్నట్లు, తన ముఖ కవళికల చాటున దాగీదాగనట్లున్న ఒక రోదన. మెల్లగా తన అడుగులను ముందుకు వేసి వర్షం లోకి నడిచాడు. ఒక్కొక్క చినుకు తనపై పడుతుంటే అది తన మనసుని కట్టిపదేసింది. ఆ వర్షం లో తడవటం తనకి ఎంతగానో నచ్చింది. కాళ్ళను చెప్పులలో దూర్చి నడక సాగించటం మొదలు పెట్టాడు. దారంతా నిర్మానుష్యంగా ఉంది, పక్కన మాకూ కష్టాలున్నయి అని చెప్తూ పంటపొలాలు, మరోపక్క నన్నెవరూ మించలేరంటూ ఎత్తైన కొండ శిఖరం. అతని చూపు మాత్రం వాటి మీదకు మళ్ళటం లేదు. కళ్ళు కిందకు చూస్తున్నాయి, కాళ్ళు అలసట లేకుండా ముందుకు నడుస్తున్నాయి. మార్గమంతా వాన నీటితో బురదగా ఉంది. అకస్మాత్తుగా నడక ఆపి చెప్పుని చీల్చుకు వచ్చి తన కాలికి గుచ్చుకున్న ముల్లుని నెమ్మదిగా తీసాడు. తన ముఖం లో ఎలాంటి మార్పూ లేదు, ఆ ముల్లు సైతం తనపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. మరల నడక మొదలు పెట్టాడు. ఎక్కడనుంచో వచ్చి తన నడక మార్గానికి సమాంతరంగా చేరింది ఒక రైలు పట్టాలు. దానిపై వచ్చిన రైలు చేసిన శబ్దం తన చూపును అటు వైపుగా తిప్పింది. ఇప్పుడు తన ద్రుష్టి ఆ రైలు పట్టాలు పై పడింది. వెంటనే తన కాళ్ళు అటుగా కదిలాయి. ఆ పట్టాలు మార్గం లో నడుస్తూ మళ్ళీ తన లోకం లో ఎదో ఆలోచిస్తూ కదులుతున్నాడతను. వర్షం ఇంకా పడుతూనే ఉంది, ఆ వాన చినుకులు తన కన్నీటిని కప్పి ప్రకృతిని మోసం చేస్తున్నాయి. తన నడక సాగుతూనే ఉంది. దూరంగా ఒక కొండ కనిపిస్తే అటుగా కదిలి ఆ కొండపైకి నడక సాగించాడు. ఇంకా ఎదో తెలియని బాధ తన ముఖం పైనుండి వెళ్ళలేదు. వాన కాస్త సద్దుమణిగింది. తన కన్నీరు మాత్రం ఇంకా ఆగలేదు.
(ఇంకా ఉంది)